వేదాద్రి క్షేత్రం...బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం:

వేదాద్రి క్షేత్రం...శ్రీ నరసింహ స్వామి అవతరించిన అత్యంత శక్తిమంతమైన క్షేత్రాల్లో ఒకటి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో కృష్ణా తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. వేదాలను తనలో నిక్షిప్తం చేసుకున్న పర్వత ప్రాంతం కనుక ఈ ప్రాంతానికి వేదాద్రి అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో స్వామివారు ఐదు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదాద్రి క్షేత్ర మహాత్యంను శ్రీనాధుడు తన 'కాశీ ఖండం'లో రాశారు. ఎర్రన, నారాయణ తీర్థులు కూడా తాము రచించిన కావ్యాల్లో వేదాద్రి క్షేత్ర ప్రస్తావన చేశారు.

 

     

ఆలయ చరిత్ర ` సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద నుంచి వేదాలను అపహరించి వాటిని సముద్ర గర్భంలో దాచారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారమెత్తి సోమకాసురుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అప్పుడు వేదాలు స్వామివారి సన్నిధిలో తరించే భాగ్యాన్ని కలిగించమని కోరడంతో నరసింహావతారంలో తాను హిరణ్యకశిపుడిని సంహరించిన తరువాత ఆ కోరిక తీరుతుందని చెప్పారు. తనను అభిషేకించాలని కృష్ణవేణి కూడా ఆరాటపడుతుందని, అందువలన తాను వచ్చేంతవరకు ఆ నదిలో సాలగ్రామ శిలలుగా ఉండమంటూ అనుగ్రహించారు. ఆ తరువాత హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం స్వామి ఇక్కడే ఐదు అంశలతో ఆవిర్భవించాడు.